Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని 21, 23 డివిజన్లలో అభివృద్ధి పనులకు మూడు కోట్ల 20 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 21వ డివిజన్లోని రవీంద్ర నగర్లో 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డుకు, 23వ డివిజన్లోని సిసి రోడ్డుకు 20 లక్షల రూపాయలతో గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ ఇప్పటికే 21వ డివిజన్లో 80 లక్షల రూపాయలు అభివృద్ధి పనులకు కేటాయించామని, మరో 80 లక్షల రూపాయలు ఇస్తామని, 23వ డివిజన్లో 4 సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులకు కోటి 60 లక్షల రూపాయలు కేటాయించనున్నట్టు తెలిపారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైన్లు అవసరమో, అక్కడ వాటిని నిర్మిస్తామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేనంత సంక్షేమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధి పనులకు కూడా సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని తెలిపారు. అయితే తెలుగుదేశం, దానికి వత్తాసు పలికే వారు అభివృద్ధి జరగడం లేదని దొంగ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్యానికి సీఎం జగన్ మొదటి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. అందువల్లే ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన ఫలితాలు లభిస్తున్నాయని గుర్తు చేశారు.
దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకాన్ని, సీఎం జగన్ మరింతగా విస్తరించి అందరికీ అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు. నగరం పలు ప్రాంతాలకు విస్తరించిందని, లేఔట్లు వేసేవారు రోడ్లు, డ్రైన్లు వేయకుండా చేతులు దులుపుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముందు అలా కుదరదని, దీనిపై ఒక సమావేశాన్ని నిర్వహించి కట్టడి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కార్పొరేటర్లు వైసిపి నేతల సహకారంతో నగరాన్ని, రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు మోయిళ్ల గౌరీ, సురేష్ రెడ్డి, కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, పాతపాటి ప్రభాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కార్పొరేటర్లు సత్తార్, మూలె విజయభాస్కర్ రెడ్డి, వైసీపీ నేతలు కోటేశ్వర్ రెడ్డి, ఏసు నాయుడు, రియాజ్, కోడూరు కమలాకర్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, సుబ్బారెడ్డి, హరిబాబు యాదవ్, పాలకీర్తి రవి, అల్లా బక్షు, మేఘనాథ్ సింగ్, జీవన్ ప్రసాద్, సుధీర్ రెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
