Clock Of Nellore ( Indukurupeta ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ నెల్లూరుజిల్లాలో విస్త్రృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులు ఆయా పరిధిలోని ప్రతీ ఇంటిని సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరాలతో పాటూ ఇతర రుగ్మతలేమైనా ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇందుకూరుపేట మండలం, కొమరిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ శ్రావణి గత వారం రోజులుగా ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నారు. ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ లో భాగంగా ఆమె ప్రతీ ఇంటికి వెళ్లి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకుని ఇంటి వద్దే వైద్య సేవలు అందించారు. అంతే కాకుండా తాగు నీటి నాణ్యతను తనిఖీ చేశారు. నీటి నమూనాలను సేకరించి, టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపారు. వేసవి కాలం నేపద్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని పరిశీలించి పారిశుధ్య విభాగ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి వెంట కొమరిక ఏఎన్ఎం పద్మ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
