Clock Of Nellore ( Nellore ) – సవాళ్లు… ప్రతి సవాళ్లకు వేదికగా మారింది నెల్లూరు స్టోన్ హౌస్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం. అమ్మవారి ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, నుడా ఛైర్మైన్ ముక్కాల ద్వారకానాథ్ 6 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం నేతలు ఆరోపణలు చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, పూర్తి పారదర్శకంగా అమ్మవారి ఆలయాన్ని పునర్ నిర్మించామని ద్వారకానాథ్ స్పష్టం చేశారు. దీనిపై గురువారం ఆలయానికి వచ్చి అమ్మవారి ఎదుట ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. గురువారం ఉదయం ముక్కాల ద్వారకానాథ్ తో పాటూ ఆయన మద్దతుదారులు ఆలయానికి చేరుకున్నారు. అదే క్రమంలో టిడిపి వాణిజ్య విభాగం నేతలు కూడా ఆలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. విషయాన్ని ముందే పసిగట్టిన పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. ఇరువర్గాల వారిని దూరంగా పంపారు. ఆలయ నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని, లెక్కలు బయటపెట్టాలని టిడిపి వాణిజ్య విభాగం నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేసి అక్కడి నుండి వెళ్లి పోయారు. అనంతరం ముక్కాల ద్వారకానాథ్ అమ్మవారి ఆలయంలోకి వెళ్లి ప్రమాణం చేశారు. ఆలయ నిర్మాణ పనుల్లో పైసా కూడా దుర్వినియోగం కాలేదని ప్రమాణం చేశారు.
అనంతరం ముక్కాల ద్వారకానాథ్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఎదుట ప్రమాణం చేయలేక టిడిపి వాణిజ్య విభాగం నేతలు పారిపోయారని విమర్శించారు. ఆలయ నిర్మాణానికి 550 మంది దాతలు సహకరించారని, ప్రతీ దానికి రికార్డు ఉందని స్పష్టం చేశారు. ప్రతి రూపాయి పారదర్శకంగా ఖర్చు చేశామని, కేవలం రాజకీయ దురుద్దేశాలతో తనపై ఆరోపణలు చేస్తున్నారని ద్వారకానాథ్ మండిపడ్డారు. ఆలయ అకౌంటెంట్ అకాలంగా మృతి చెందడంతో లెక్కలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందని, కర్ణాటక నుండి ఇంకా కొన్ని వెండి ఆభరణాలు రావాల్సి ఉందన్నారు. అవన్నీ రాగానే ఆలయ పునర్ నిర్మాణానికి సంబంధించిన లెక్కలు అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలియజేశారు. దేవస్థాన నిర్మాణం గురుంచి రాష్ట్రం గొప్పగా చెప్పుకుంటుందని, ఇది ఆర్యవైశ్యులందరికీ గర్వకారణంగా నిలుస్తుందని తెలియజేస్తూ అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.
