Clock Of Nellore ( Nellore ) – ఉదయగిరి రాజకీయాల నుంచి మేకపాటి కుటుంబం వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన ఆ కుటుంబం నుంచే ఎవరో ఒకరు రంగంలో ఉండాలని ఆ కుటుంబ పెద్ద, మాజీ ఎంపి మేకపాటి రాజ మోహన్ రెడ్డి ఆశపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తన మూడో సోదరుడు మేకపాటి రాజారెడ్డిని ఉదయగిరి నుంచి రంగంలోకి దింపడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సస్పెన్షన్ ఎపిసోడ్ తర్వాత అక్కడి నుంచి నలుగురు వ్యక్తులు టికెట్ కోసం పోటీపడు తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తొలుత చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె రచనారెడ్డి, అటు తరువాత అల్లుడు ఆదాల వంశీ కృష్ణారెడ్డి పేర్లు ముందుకొచ్చాయి. చివరికి వారు వెనక్కి వెళ్లారు. ఇక మేకపాటి కుటుంబం ఉదయగిరి నుంచి వెనక్కి వెళ్లారని అందరూ భావించారు. ఊహించని విధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు రాజారెడ్డి. రాజమోహన్ రెడ్డి చిన్న కుమారుడు పృధ్వీరెడ్డి పేర్లు వచ్చాయి. చివరికి రాజారెడ్డిని రంగంలోకి దించేలా కనిపిస్తున్నారు.
ఉదయగిరి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇక్కడ నుంచి ఎవరు రంగంలో ఉంటారనే విషయం పై కొత్త కొత్త పేర్లు ముందుకొస్తున్నాయి. తాజాగా మేకపాటి రాజారెడ్డి పేరు వినిపిస్తుంది. మేకపాటి రాజమోహన్ రెడ్డి చిన్న తమ్ముడు రాజారెడ్డి. ఈయన బెంగుళూరులో వ్యాపారవేత్తగానూ, కాంట్రాక్టర్ గానూ ఉన్నారు. ఉదయగిరి ప్రాంతంలో మేకపాటి కుటుంబానికి 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1983 నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం ఉదయగిరిలో తమ ప్రాభల్యాన్ని చూపుతోంది. ఆయన సోదరులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఇటీవల వైసీపి సస్పెండ్ చేసిని విషయం తెలిసిందే. అప్పటి నుంచి నలుగురు నేతలు ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తమ కుటుంబం నుంచి ఉదయగిరి చేజారుతుందని భావించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇటీవల సిఎం జగన్ ను కలిసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె, ఆదాల రాఘవరెడ్డి కోడలు ఆదాల రచనారెడ్డి పేరును ప్రతిపాదించారు. అయితే సిఎం జగన్ ఆదాల వంశీకృష్ణారెడ్డి అయితే ఎలా ఉంటుంది అని సూచించినట్లు తెలిసింది. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి గత నెల 24న హైదరాబాద్ లో ఆ కుటుంబంతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే రచనారెడ్డి, వంశీకృష్ణారెడ్డి ఇద్దరూ విముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి… సిఎం దృష్ఠికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయాలపై చర్చించి తన మరో సోదరుడు మేకపాటి రాజారెడ్డి పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.
ఇప్పటికే ఉదయగిరిలో మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డిలు నేనంటే నేను అంటూ పోటీలో ఉన్నారు. మేకపాటి కుటుంబం ఉదయగిరి నుండి వెనక్కు వెళ్తోంది అని ప్రచారం సాగడంతో వారు టిక్కెట్ కోసం మళ్లీ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో మేకపాటి రాజమోహన్ రెడ్డి గత వారం రోజులుగా ఉదయగిరిపై కసరత్తు చేస్తున్నారు. తమ కుటుంబానికే అవకాశం ఇస్తానని మేకపాటికి జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ఎందుకు టికెట్ వదులుకోవాలనే ఉద్దేశ్యంతో తన ఇంకో సోదరుడు మేకపాటి రాజారెడ్డితో మాట్లాడినట్లు తెలిసింది. ప్రస్తుతం నియోజకవర్గాన్ని వదులుకుంటే 40 సంవత్సరాల చరిత్ర కనుమరుగు అవుతుందని ఈ తరుణంలో పోటీలో ఉండాలని రాజారెడ్డిని రాజమోహన్ రెడ్డి కోరినట్లు ప్రచారం సాగుతుంది. అన్న ప్రతిపాదనను రాజారెడ్డి అంగీకరించినట్లు సమాచారం. నేడో రేపో మేకపాటి రాజారెడ్డి నెల్లూరుకు రానున్నారు.