Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలో పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నగర మేయర్ పోట్లూరి స్రవంతి సోమవారం 12వ డివిజన్ అల్లీపురంను సందర్శించారు. ఇందులో భాగంగా అల్లీపురం పరిసర ప్రాంతాల్లోని వీధులను మేయర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచనల మేరకు 12వ డివిజన్ అల్లీపురంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పర్యవేక్షించామని తెలిపారు. చెత్త వ్యర్ధాలు ఎక్కడా కూడా కనిపించకుండా ప్రణాళికా బద్ధంగా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఎక్కడైనా చెత్తా, వ్యర్ధాలు ఉంటే స్థానిక ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రజలతో మేయర్ ప్రత్యక్షంగా మాట్లాడుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని పారిశుధ్య, తాగునీరు, వీధి దీపాలు, కుక్కలు, పందుల సంచారం వంటి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మేయర్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
