ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి… జాగ్రత్తలు తీసుకోండి … అధికారులకు మేయర్ ఆదేశం

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర వ్యాప్తంగా రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి ఉష్ణోగ్రతల నేపధ్యంలో తక్షణమే తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై నెల్లూరు నగర మేయర్ స్రవంతి నగరపాలక సంస్థ అధికారులతో తన ఛాంబర్ లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రస్తుతం నగరవ్యాప్తంగా 37 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్న కారణంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో తక్షణమే తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులతో చర్చించారు. వేసవి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకర్ల ద్వారా అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా అందించాలని, అవసరమైన డివిజన్లలో తాగునీటి సౌకర్యం అందించడానికి ట్యాంకర్ల ద్వారా నీటిని నిరంతరం సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్ళు, జన సంచారం ఎక్కువగా ఉండే రద్దీ ప్రదేశాలు, బస్టాండ్లు తదితర ప్రాంతాలలో తక్షణమే మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అదే విధంగా విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రతలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ప్రమాద సంఘటనలపై సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకునే విధంగా అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం పాటించాలని అధికారులకు తెలిపారు. ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎండ తీవ్రత నుంచి ఏ విధంగా రక్షణ పొందాలో ప్రజలకు అవగాహన కల్పించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ శాఖ అధికారులు, ఆరోగ్యశాఖ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.

Read Previous

చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్ అదిరిపోవాలి : కార్యకర్తలతో కోటంరెడ్డి

Read Next

బిసీల అభ్యున్నతిపై మాట్లాడే హక్కు వైసీపికి మాత్రమే ఉంది : టిడిపి నేతలపై అనీల్ ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published.