నా భార్యను నాకు అప్పగించండి : శేషసాయి ఆక్రందన

Clock Of Nellore ( Nellore ) – వైసీపి నేతల ఒత్తిళ్లతో పోలీసులు తన భార్యను వారి తల్లిదండ్రులకు బలవంతంగా అప్పగించారని నెల్లూరు రూరల్ మండలం, కాకుపల్లికి చెందిన తిరకాల శేషసాయి అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను తనకు అప్పగించేలా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో సోమవారం శేషసాయి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పొదలకూరు మండలం, మర్రెపల్లి గ్రామానికి చెందిన శివప్రియ తానూ గత 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, అమ్మాయి తరపు తల్లిదండ్రులు తమ వివాహానికి ఒప్పుకోకపోవడంతో గత నెల 17న తామిద్దరం కేరళకు వెళ్లి అక్కడ వివాహం చేసుకున్నట్లు తెలిపారు. అయితే శివప్రియను తాను కిడ్నాప్ చేశానని వారి తల్లిదండ్రులు రెండు దఫాలు తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారని, అయితే పోలీసుల ఎదుట హాజరైన శివప్రియ తాను ఇష్టపూర్వకంగా శేషసాయిని వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. తాజాగా శనివారం నాడు పొదలకూరు పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారన్నారు. పొదలకూరు పోలీసులు తమను పిలిపించి తనపై కేసు నమోదు చేసి శివప్రియను బలవంతంగా వారి కుటుంబసభ్యులతో పంపించి వేశారన్నారు. కొందరు వైసీపి నేతల ఒత్తిళ్లతోనే తమను విడతీశారని, తన భార్యను తనకు అప్పగించాలని శేషసాయి జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.

Read Previous

చెరువులో గల్లంతయిన బాలుడు మృత్యువాత

Read Next

జూన్ 2వ వారం కల్లా నాడు – నేడు పనులు పూర్తి కావాలి : అధికారులను ఆదేశించిన కలెక్టర్

Leave a Reply

Your email address will not be published.