Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ఐఏఎస్ అధికారి వికాస్ మర్మట్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం నెల్లూరులోని కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్న వికాస్ మర్మట్ తన ఛాంబర్ కు వెళ్లి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇతర అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్ కు పుష్ప గుచ్చాలు సమర్పించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమిషనర్ వికాస్ మర్మట్ మాట్లాడుతూ కార్పొరేషన్ లోని అన్నీ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించి నగరాభివృద్ధి అవసరమైన ప్రణాళికలను సిద్దం చేస్తామని అన్నారు. వేగవంతమైన పాలన అందించేందుకు, త్వరితగతిన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు గతంలో వివిభ ప్రభుత్వ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సచివాలయాలను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేస్తూ వాటి ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని వికాస్ మర్మట్ తెలియజేశారు. అనంతరం ఆయన మేయర్ ఛాంబర్ కు వెళ్లి మేయర్ స్రవంతిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ స్రవంతి నూతన కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నగర అభివృద్ధిపై కొద్ది సేపు చర్చించారు. అభివృద్ధి విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలని సూచించారు. తర్వాత కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న నూతన కమిషనర్ వికాస్ మర్మట్ జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

