Clock Of Nellore ( Nellore ) – ఉదయగిరి వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె మేకపాటి రచనా రెడ్డి 2024 ఎన్నికల్లో పోటీ చేయనుందని మాజీ ఎంపి, చంద్రశేఖర్ రెడ్డి అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దుష్ఠశక్తుల వలలో ఇరుక్కుపోయి తమ కుటుంబ పరువు తీశాడని మండిపడ్డారు. ఉదయగిరి నియోజకవర్గంలో టెర్రర్ గా బ్రతికిన తన తమ్ముడు డబ్బుకు ఆశపడి చెడ్డపేరు తెచ్చుకున్నాడని, డబ్బు అవసరమైతే తనను అడిగి ఉంటే ఇచ్చే వాడిని అని పేర్కొన్నారు. తనతో మాట్లాడి నాలుగేళ్లు అవుతుందని అంటూ పార్టీ పరంగా తప్పు చేశాడు కాబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశారని వెల్లడించారు. నియోజకవర్గంలో పూర్తిగా బ్రష్ఠుపట్టిపోయాడన్నారు. 2024 ఎన్నికల్లో ఉదయగిరి నుండి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె మేకపాటి రచనా రెడ్డి పోటీ చేస్తారని అది కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ అంగీకరిస్తేనే అని స్పష్టం చేశారు. మేకపాటి రచనా రెడ్డి… ప్రస్తుతం నెల్లూరు ఎంపిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న ఆదాల రాఘవ రెడ్డికి కోడలు. రాఘవ రెడ్డి కుమారుడు వంశీధర్ రెడ్డి సతీమణి. ఆమె పలు కంపెనీల్లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడ్డ రచనారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతుంది.
