Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలపైనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు కస్తూరి దేవి గార్డెన్స్ లో బుధవారం జరిగిన రూరల్ నియోజకవర్గానికి సంభందించిన వైయస్సార్ ఆసరా మూడో విడత సంబరాల కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపి ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం మహిళల్లో చైతన్యం ఎంతో పెరిగిందని, ఇప్పుడు హుందాగా బయటకు రావడం, మాట్లాడటం చూస్తే ముచ్చటేస్తుందన్నారు. వైయస్ ఆసరా కార్యక్రమం నుంచి లభించే ప్రయోజనాన్ని కుటుంబ వృద్ధికి, పిల్లల చదువుకు వినియోగించాలని కోరారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ సీఎం జగన్ మహిళలకు పాదయాత్రలో ఇచ్చిన హామీని విడతల వారీగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికి మూడు విడతలు పూర్తి చేసిన సీఎం, నాలుగో విడతను కూడా ఇచ్చేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా, మాట ఇచ్చిన పథకాలను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ తో పాటు మమ్మల్ని కూడా మీ ఓటుతో ఆశీర్వదించాలని కోరారు. ఎంపీ ఆదాల 16.93 కోట్ల రూపాయల ఆసరా చెక్కును మహిళా సమాఖ్యకు మంత్రితో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, వైసిపి జిల్లా అధ్యక్షురాలు మొయిళ్ళ గౌరీ తదితరులు ఆసరా పథకం ద్వారా మహిళలకు జరుగుతున్న మేలు గురించి మాట్లాడారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిఆర్డిఏ పిడి సాంబశివరెడ్డి, కార్పొరేటర్లు, వైసిపి నేతలు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు జ్యోతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఈ ఉత్సవాల్లో భాగంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
