Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పొట్టేపాళెం కలుజు వద్ద భారతీయ జనతా యువమోర్చా ( BJYM ) నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎన్.కె. యశ్వంత్ సింగ్ ఠాకూర్ నిరసన తెలియజేశారు. BJYM నేతలతో కలిసి బుధవారం కలుజు వద్దకు చేరుకుని నీళ్లలో కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనదారులకు ప్రమాదకరంగా మారిన ఈ కలుజుపై వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. నిత్యం కలుజులో నీటి ప్రవాహం సాగుతూనే ఉందని, ఆ నీటి ప్రవాహంలోనే వాహనాలు ప్రయాణించాల్సి ఉందన్నారు. కలుజులో పాచి కారణంగా వాహనాలు జారి పడి చోదకులు గాయాలపాలవుతున్నారని యశ్వంత్ సింగ్ వెల్లడించారు. ఇప్పటికే అనేక మంది ఈ కలుజు కారణంగా ప్రమాదాలకు గురైనారన్నారు. గురువారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జలదీక్షకు మద్దతు ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఎవరు పోరాటాలు చేసినా మద్దతిస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా జిల్లా కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి సాయి, బుచ్చి యువమోర్చా అధ్యక్షులు పెంచల కృష్ణ, బిజేపి నేతలు రాము తదితరులు పాల్గొన్నారు.
