Clock Of Nellore ( Nellore ) – వైసీపి సేవా దళ్ రాష్ట్ర అధ్యక్షులు, నెల్లూరు రూరల్ వైసీపి తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు నుండి కార్యకర్తలతో కలిసి మంగళగిరికి బయలుదేరారు. నగరంలోని కస్తూరిదేవి గార్డెన్ నుండి సుమారు 400 కార్లలో నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మంగళగిరికి బయలుదేశారు. ఈ సందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. చంద్రబాబు విజనరీ లీడర్ అని ఆయన ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. మరో వైపు గిరిధర్ రెడ్డి మంగళగిరికి బయలుదేరే కార్యక్రమాన్ని అన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2 గంటలకు గిరిధర్ రెడ్డి టిడిపిలో చేరుతారు.
