Clock Of Nellore ( Nellore ) – జన విజ్ఞాన వేదిక కన్వీనర్, ప్రజా వైద్యుడు, నెల్లూరు హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ జి. విజయకుమార్ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది నెల్లూరులోని మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు. ఈ కేసులో డాక్టర్ విజయకుమార్ భార్య ఉషారాణి, కుమారుడు సుందరయ్య, న్యాయవాది కునిశెట్టి శ్రీధర్ తో సహా మరో ఇద్దరు కిరాయి హంతకులను దోషులుగా తేలుస్తూ ఆ 5 మందికి జీవిత ఖైదును విధించింది. వివరాల్లో కెళ్తే… కుటుంబ వివాదాల నేపద్యంలో డాక్టర్ విజయకుమార్ తల్లి వద్ద ఉండేవారు. భార్య విడిగా ఉండేది. కుమారుడు అప్పుడప్పుడూ తండ్రి వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఆస్థి తమకు దక్కదన్న అనుమానంతో భర్తను హతమార్చాలను భార్య ఉషారాణి పథకం రచించింది. న్యాయవాది శ్రీధర్ తో కలిసి పథకాన్ని అమలు చేసింది. 2015 మే 28వ తేదీనా అర్ధరాత్రి డాక్టర్ విజయకుమార్ ఇంట్లో నిద్రిస్తుండగా ఉషారాణి, కుమారుడు సుందరయ్య, న్యాయవాది శ్రీధర్, కిరాయి హంతకులు పోలురాజు, గంగరాజు అనే 5 మంది బెడ్ రూంలోకి వెళ్లి విజయకుమార్ ను గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్దమయ్యారు. అయితే విజయకుమార్ భౌతిక కాయాన్ని చూసిన ఆయన స్నేహితులైన వైద్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేశారు. నాటకీయ పరిణామాల మధ్య అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపగా, డాక్టర్ విజయకుమార్ ను ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ జరిపారు. సిసి టివి కెమరా ఫుటేజీలు సేకరించారు. భార్య, కుమారుడు, న్యాయవాది శ్రీధర్ మరో ఇద్దరు ఆయన్ను హత్య చేశారని నిర్ధారించి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుండి ఈ కేసు విచారణ కోర్టులో ఉంది. శుక్రవారం నెల్లూరులోని మొదటి అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. హత్య చేసింది ఆ నలుగురేనని నిర్ధారణ జరిపి, ఆ 5 మందికి జీవితఖైదును విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది న్యాయమూర్తి. ఈ తీర్పుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.