Clock Of Nellore ( Nellore ) – శోభకృత్ నామ సంవత్సర ఉగాది జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు అందించాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకాంక్షించారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను మన సంస్కృతీ సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు నగర మేయర్ స్రవంతితో కలిసి జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పేరుతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ సంపూర్ణంగా ప్రజలందరికీ అంది, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలని, పుష్కలంగా వర్షాలు పడి అన్నదాతలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో ప్రభుత్వం అమలు చేయనున్న వైయస్సార్ ఆసరాకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, మహిళలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తొలుత తిక్కన ప్రాంగణానికి విచ్చేసిన కలెక్టర్ కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకగా, ప్రముఖ పంచాంగకర్త ఆలూరు శిరోమణి శర్మ ఉగాది పంచాంగ శ్రవణం వినిపించారు. శోభకృత్ నామ సంవత్సరములో అన్ని శుభాలేనని, అన్నిరంగాల్లోనూ జిల్లా అభివృద్ధిపథంలో పయనిస్తోందని ఆయన తన పంచాంగ శ్రవణంలో పేర్కొన్నారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం కవులు తమ కవితా శీర్షికలను చదివి వినిపించారు. ఈ సందర్భంగా కవులు, కళాకారులను జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్ పర్సన్, మేయర్, డిఆర్ఓ ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, మత్స్య శాఖ, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్లు నాగేశ్వరావు, సుధాకర్ రాజు, ఏపీఎంఐపీ, హర్టీకల్చర్ పీడీలు శ్రీనివాసులు, సుబ్బారెడ్డి, జిల్లా పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారి కనకదుర్గ భవాని, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, ఆర్డిఓ మలోల, జిల్లాస్థాయి అధికారులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.
