Clock Of Nellore ( Nellore ) – అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికారులపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం కలిగించాయి. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ లో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షకు జిల్లా కలెక్టర్ తో సహా అన్నీ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాధారణంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అధికారుల నిర్లక్ష్యం కారణంగా తన నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సమస్యలపై నిలదీసి ప్రజల పట్ల తనకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిక సంకేళ్లు తప్పా అనే శ్రీశ్రీ మాటలే తనకు స్పూర్తి అని గుర్తు చేస్తూ రాష్ట్ర స్థాయి అధికారి నుండి జిల్లా స్థాయి అధికారుల వరకూ తలంటి పోశారు.
నెల్లూరు శివారులోని పొట్టేపాళెం కలుజుపై వెళ్లేందుకు ప్రజలు హడలిపోతున్నారని, ఈ ప్రాంతంలో వంతెన నిర్మించాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా అతీగతి లేదని అన్నారు. రెండేళ్ల క్రితం వంతెన మంజూరైందని రోడ్లు భవనాల శాఖ అధికారులు చెప్పారని అయితే ఇప్పటి వరకూ పనులు ఎందుకు ప్రారంభించలేదో చెప్పాలని అధికారులను నిలదీశారు. కొండ్లపూడి, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి గ్రామాల్లో రోడ్ల కోసం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 12 కోట్లు కేటాయించారని, రెండు మూడు దఫాలు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రాలేదన్నారు. 10వేల మంది జనాభా ఉన్న బుజబుజ నెల్లూరులో రోడ్లు, కాలువలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కొమ్మరపూడి ప్రాంతంలో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ముఖ్యమంత్రి 10 కోట్లు కేటాయించారని, అందులో 60 శాతం పనులు పూర్తయ్యాయని అయితే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిపేశారని గుర్తు చేశారు. ముస్లిం, మైనార్టీలకు సంభందించిన గురుకుల పాఠశాల పనులు 90 శాతం పూర్తయ్యాయని, గత నాలుగేళ్లుగా ములిగిన 10 శాతం పనులు పూర్తి చేయడం లేదని, పనులు పూర్తి చేయని ఆ కాంట్రాక్టర్ ను ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని అధికారులను ప్రశ్నించారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేసేందుకు డబ్బులు లేవు గానీ నెల్లూరు కార్పొరేషన్ కమీషనర్ కు బంగ్లా నిర్మించేందుకు కోటి రూపాయలు ఎలా వచ్చాయని నిలదీశారు. వీటిపై ప్రజలు తనను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో బీసి భవన్, అంబేద్కర్ భవన్, లైబ్రరీ నిర్మాణం పిల్లర్ల దశలోనే ఆగిపోయాయని, వీటిపై అమరావతిలో ఉండే అధికారులకు దయకలగడం లేదని అన్నారు.
ఇసుక లారీలతో గొల్లకందుకూరు, సజ్జాపురంలో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. ఇసుక లారీలను నియంత్రించే వారే లేరా అని అన్నారు. కోడూరుపాడు, కొత్త కాలువ రోడ్డు పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. నారాయణరెడ్డి పేట, గొలగమూడి, కొత్తూరు రోడ్లను తానే కాంట్రాక్టర్లను బతిమలాడి వేయించుకున్నానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. వావిలేటి పాడులోని జగనన్న లే అవుట్ ను చదును చేయించాలని ఎప్పటి నుండో అడుగుతున్నా అతీగతీ లేదని అధికారుల నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. నగరంలోని డికెడబ్ల్యు కళాశాల వద్ద నుండి డైకాస్ రోడ్డు వరకూ రోడ్డు అధ్వాన్నంగా ఉంది… రోడ్డు వేయమని ఆర్ అండ్ బి అధికారులను కోరితే సగం వైపు మంజూరైందని రోడ్డు వేసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రోడ్డులో సగం వైపు మాత్రమే వేయడంతో ఓ వైపు ఎత్తు, మరో వైపు లోతట్టుగా మారి, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై ఆర్ అండ్ బి అధికారులను అడిగి అడిగి అలసిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 3 కిలోమీటర్లు రోడ్డులో ఓ వైపు వేసేదానికంటే… రెండు వైపులా ఒకటిన్నర కిలోమీటర్ వేస్తే సరిపోతుంది అనే కనీస పరిజ్ఞానం కూడా అధికారులకు లేకుండా పోయిందని విమర్శించారు.
అదే సమయంలో ఏపీ ఫైనాన్షియల్ సెక్రటరీ రావత్ వ్యవహార శైలిపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలంటే రావత్ కు లెక్కలేని తనంగా మారిందన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న పథకాలకు సంబంధించి ఫైనాన్షియల్ సెక్రటరీ రావత్ వద్దకు వెళ్తే, కనీసం కూర్చోమని కూడా చెప్పలేదని అన్నారు. రావత్ ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసి ఉంటాడని.. కానీ తన లాంటి ఎమ్మెల్యేలు కూడా ఉంటారని.. కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుందని హెచ్చరించారు. మొత్తానికి శుక్రవారం జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.