Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం రాత్రి ప్రీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మేయర్ స్రవంతి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యాలయ ప్రాంగణంలో దేదీప్యమైన విద్యుత్ కాంతుల నడుమ క్రిస్మస్ ట్రీ, క్రీస్తు జననం కళాఖండాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా క్రీస్తు జననానికి సంబందించిన ముఖ్య ఘట్టాలను వివరిస్తూ సంగీత వాయిద్యాల నడుమ క్రీస్తు గానమును కార్యాలయ సిబ్బంది ఆలపించారు. అనంతరం ఆనందోత్సాహాల నడుమ కేక్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు. ప్రీ క్రిస్మస్ వేడుకలనుద్దేసించి మేయర్ మాట్లాడుతూ ఇటీవల రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నామని, అదేవిధంగా నగరపాలక సంస్థలో కూడా ప్రతి ఏటా ప్రీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ సిబ్బందికి, నగర ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను మేయర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ డి.హరిత, కార్పొరేటర్లు యాకసిరి వాసంతి, చేజెర్ల మహేష్, కో-ఆప్షన్ సభ్యులు మోబీన, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
