Clock Of Nellore ( Nellore ) – సమాజంలో మెరుగైన జీవనం సాగించడానికి విభిన్న ప్రతిభావంతులకు అన్ని విధాల ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రతి ఒక్కరూ కూడా మానవతా దృక్పథంతో విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు పొదలకూరురోడ్డులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో వైకల్య నిర్ధారణ వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులపాటు ఎంపిక చేసిన పాఠశాలల్లో వైకల్య నిర్ధారణ వైద్య శిబిరాలు పరీక్షలు నిర్వహించి అవసరమైన ఉపకరణాలను అందించనున్నట్లు చెప్పారు. 2009 విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత దివ్యాంగులందరూ తప్పనిసరిగా విద్యను అభ్యసించేందుకు వీలుగా పాఠశాలల్లో ర్యాంపుల ఏర్పాటు, ప్రత్యేక మరుగుదొడ్లు, రవాణా సౌకర్యాలు ఇలా అనేక సదుపాయాలను సమకూర్చినట్లు చెప్పారు. అలాగే జిల్లావ్యాప్తంగా 38 భవిత కేంద్రాలను ఏర్పాటు చేసి 4000 మంది విభిన్న ప్రతిభావంతులకు విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. 40 శాతం వైకల్య శాతం దాటిన వారికి ప్రతినెల 3000 రూపాయల పింఛన్ను అందిస్తున్నట్లు చెప్పారు. విభిన్న ప్రతిభవంతులందరూ తప్పనిసరిగా యు డి ఐ సి కార్డును పొందాలని,ఈ కార్డు ద్వారా ఉద్యోగాల్లో మూడు శాతం రిజర్వేషన్, అనేక సంక్షేమ పథకాలను పొందే వీలుందని ఆయన చెప్పారు. సమగ్ర శిక్ష, వైద్య ఆరోగ్యశాఖలు విభిన్న ప్రతిభావంతులకు అందిస్తున్న సేవలు పట్ల ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విభిన్న ప్రతిభవంతులందరూ ఈ క్యాంపులను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందాలని కలెక్టర్ సూచించారు. తొలుత ప్రత్యేక క్యాంపును కలెక్టర్ ప్రారంభించి వైకల్య నిర్ధారణ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో చిరంజీవి, డిఆర్డిఏ, డ్వామా పీడీలు సాంబశివారెడ్డి, వెంకట్రావు, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, జడ్పీ పాఠశాల హెచ్ఎం ప్రసన్న లక్ష్మి, విభిన్న ప్రతిభావంతులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
