Clock Of Nellore ( Nellore ) – జాతీయ స్థాయిలో నెల్లూరు జిల్లా కీర్తి ప్రతిష్టలు రెపరెపలాడేలా జిల్లాలోని విద్యార్థులందరూ యువజన ఉత్సవాల్లో తమ సత్తా చాటాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బ కళాక్షేత్రంలో యువజన సర్వీసుల శాఖ, సెట్నల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజన ఉత్సవాలను జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ భావి భారత నిర్దేశకులు యువతేనని, ఆ దిశగా యువశక్తి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. వారసత్వం అంటే తల్లిదండ్రులు మనకు ఇచ్చిన ఇంటి పేరు కాదని, మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించడమే నిజమైన వారసత్వమని మంత్రి చెప్పారు. జిల్లా స్థాయిలో నిర్వహించే అన్ని పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపి రాష్ట్ర, జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో నెల్లూరు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు.

జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ విద్యార్థులు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని రాణించాలని ఆమె ఆకాంక్షించారు. ముందుగా సెట్నల్ సీఈవో పుల్లయ్య యువజన ఉత్సవాల్లో భాగంగా జానపద గీతాలు, నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం, హిందుస్థాని, వీణ, సితార, మృదంగం, ఫ్లూట్, గిటార్ మొదలైన అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో విజేతలైన వారు రాష్ట్రస్థాయి పోటీలకు, రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు వచ్చే సంవత్సరం జనవరిలో నిర్వహించే జాతీయ స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. తొలుత యువజన ఉత్సవాలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్, వైసీపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిఆర్వో వెంకటనారాయణమ్మ, సెట్నల్ సీఈవో పుల్లయ్య, జిల్లా యువజన అధికారి మహేందర్ రెడ్డి, సమాచార శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
