Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏ జన్మలో ఏ పుణ్య కార్యం చేశారో తెలియదు గానీ ఈ జన్మలో మాత్రం ఆ మహా శివుని ఆశీస్సులను పొందారు. నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ పరమేశ్వరునికి సేవ చేసుకునే అదృష్ఠాన్ని దక్కించుకున్నారు. కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించిన వ్యక్తిగా నెల్లూరు ప్రజలచే కీర్తింపబడుతున్నారు. శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చెంత స్వర్ణాల చెరువు వద్ద ఘాట్ ను నిర్మించిన ఘనతను మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పొందగా… అదే ఘాట్ ను గణేష్ నిమజ్జన ఘాట్ గా మార్చి దాన్ని అథ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహా ఘనతను మాత్రం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే దక్కించుకున్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి తన భక్తి పారవస్యాన్ని చాటుకున్న కోటంరెడ్డి… దానికి మించి అన్న విధంగా సోమవారం అదే ప్రాంతంలో ఘనమైన ఏర్పాట్ల మధ్య కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి సాక్షాత్తూ ఆ పరమ శివుని ఆశీస్సులు పొందారనే విషయంలో అతిశయోక్తి లేదు. కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలి రాగా ఆ ప్రాంతం మరో కాశీని తలపించింది. గంగా హారతి కార్యక్రమం నభూతో న భవిష్యత్ అనే రీతిలో సాగింది. విహంగ వీక్షణంలో కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమాన్ని చూస్తే ఇది నెల్లూరా లేదా కాశీనా అన్న సందేహం రాక మానదు. భక్తుల శివనామ స్మరణలు, మేళ తాళాలు, సాంస్క్రృతిక ప్రదర్శనలు, 1008 మంది మహిళలచే నిర్వహించిన కార్తీక దీపాల శోభాయాత్రలు, వారణాసి పండితులచే నిర్వహించిన గంగా హారతులు, మత్య్సకారులు బోట్లతో స్వర్ణాల చెరువులో బోట్లతో ప్రదర్శించిన శివ లింగ ప్రతిమలు… ఇలా అన్నీ ఇన్నీ కాదు… ఎన్నెన్నో ఏర్పాట్లతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మహా దీపోత్సవ కార్యక్రమం నెల్లూరుకు రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఆ పరమ శివుని ఆశీస్సులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జీవిత కాలం ఉండేలా దీపోత్సవ కార్యక్రమం ఘనతను చాటింది.
