తల్లిదండ్రుల హత్యకు సుపారీ ఇచ్చిన కసాయి కొడుకు : అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – ఆస్తి పంపకాల్లో తనకు న్యాయం జరగలేదని ఏకంగా కన్న తల్లిదండ్రులనే హత్య చేసేందుకు ఫథకం వేశాడు ఓ కసాయి కొడుకు. తల్లిదండ్రులను చంపితే 8లక్షలు ఇస్తానని ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని వారికి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. హత్య చేసే ముఠాలోని కొందరు అనూహ్యంగా ఓ చోరీ కేసులో పట్టుబడటంతో ఈ కుట్ర బయటపడింది. పోలీసుల సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లిదండ్రుల పాణాలను కాపాడినట్లైంది. ఆ కసాయి కొడుకును కటకటాల వెనక్కు పంపారు.

వివరాల్లో కెళ్తే… నెల్లూరుజిల్లా కావలి పట్టణానికి చెందిన మురుసు లక్ష్మీ నారాయణ అనే వ్యక్తికి అతని తండ్రి మురుసు బాలకృష్ణయ్య మధ్య ఆస్థి వివాదాలు ఉన్నాయి. తన కంటే తన తమ్ముడికే ఎక్కువ ఆస్థి ఇచ్చారని తండ్రితో గొడవ పడేవాడు. ఈ క్రమంలో తండ్రిపై కక్ష్య పెంచుకున్నాడు. కావలికి చెందిన పాత నేరస్తుడు షేక్ షఫీ ఉల్లాను కలిశాడు. తన తండ్రిని చంపితే 3లక్షలు, తల్లిని చంపితే 5 లక్షలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. కొంత సుపారీ కూడా ఇచ్చాడు. ఒప్పందం కుదరడంతో షఫీ తనకు జైల్లో పరిచయం అయిన నేరస్తులు ముత్తుకూరు మండలం, బ్రహ్మదేవికి చెందిన షేక్ గౌస్ బాషా, బుచ్చికి చెందిన షేక్ షాహుల్ ను సంప్రదించి అందరం కలిసి హత్యలో పాల్గొనాలని పథకం ఖరారు చేసుకున్నారు. రెండు దఫాలు బాలకృష్ణయ్య హత్యకు రెక్కీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో అనూహ్యంగా గౌస్ బాషా, షాహుల్ ను చోరీ కేసులో బుచ్చిరెడ్డిపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు.

వారిని విచారించే క్రమంలో సుపారీ హత్యకు సంభందించిన విషయాలు వారు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. ఎవరికీ అనుమానం రాకుండా మురుసు లక్ష్మీ నారాయణ, షేక్ షఫీలను అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీ కేసులో అరెస్టయిన వారు చెప్పిన విషయం నిజమని తేలడంతో వారిని అరెస్ట్ చేశారు. వారితో పాటూ వారికి సహకరించిన కావలి పట్టణానికి చెందిన పాశం సుబ్బారావు అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ విజయరావు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. చోరీ కేసులో 3లక్షలా 25వేలు విలువైన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చోరీ కేసే కాకుండా వారిపై హత్యకు కుట్ర కేసు కూడా నమోదు చేశామన్నారు. సుఫారీ ఇచ్చిన కొడుకు లక్ష్మీనారాయణతో పాటూ ఆ కేసులులో మొత్తం 5 మందిని అరెస్ట్ చేశామన్నారు.

Read Previous

మెడికవర్ లో వరల్డ్ స్ట్రోక్ డే : పక్షవాతంపై అవగాహన పెంచుకోవాలన్న వైద్యులు

Read Next

లోన్ యాప్ నిర్వాహకులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు : కోటి 20 లక్షలు ఫ్రీజ్

Leave a Reply

Your email address will not be published.