Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగరాన్ని పర్యావరణ హితమైన స్వచ్ఛతతో ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ హరిత ఆకాంక్షించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో “ఇండియన్ స్వచ్ఛతా లీగ్” ర్యాలీని శనివారం నిర్వహించారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక బారాషాహీద్ దర్గా ప్రాంగణం, ఘాట్ పరిసర ప్రాంతాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని పారిశుద్ధ్య నిర్వహణ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా స్వచ్ఛతా దివస్ నిర్వహణలో భాగంగా పరిసరాల పరిశుభ్రతలో యువతను భాగస్వామ్యం చేయడానికి కార్యక్రమం రూపొందించారని తెలిపారు. ప్రతిఒక్కరూ తమ ఇంటిని ఏవిధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటారో, అదేవిధంగా పరిసర ప్రాంతాలను కూడా స్వచ్ఛంగా ఉంచుకుని పర్యావరణానికి దోహదపడాలని పిలుపునిచ్చారు.

బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేయడం, పచ్చదనాన్ని నాశనం చేయడం, వ్యర్ధాలను భారీ స్థాయిలో తగలబెట్టడం వంటి చర్యలు మానుకుని భవిష్యత్తు తరాలకు స్వచ్జమైన పర్యావరణాన్ని అందించేందుకు కృషి చేయాలని కోరారు. సామాజిక చైతన్య కార్యక్రమాల్లో ముఖ్యంగా యువత పాల్గొనడం అత్యంత స్ఫూర్తిదాయకమని, పర్యావరణ పరిరక్షణ చర్యలను ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలని వారు సూచించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ దేశ వ్యాప్తంగా సైకిల్ ర్యాలీ నిర్వహించిన నగరానికి చెందిన పెంచల చైతన్యను మేయర్, కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యాకసిరి వాసంతి, డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, సూపరింటెండింగ్ ఇంజనీర్ సంపత్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి, అన్ని విభాగాల అధికారులు, సచివాలయం కార్యదర్శులు, నగర పాలక సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
