నెల్లూరు దంపతుల హత్య కేసు : నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని పడారుపల్లి అశోక్ నగర్ లో ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి దంపతులను హత్య చేసిన నేరంలో ముద్దాయిలను నెల్లూరు పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. దంపతులకు సంభందించిన క్యాంటీన్ లో పనిచేసే సప్లయిరే మొదటి ముద్దాయిగా గుర్తించారు. పోలీసులు తెలియజేసిన వివరాల్లోకి వెళ్తే… కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతులు 25 ఏళ్ల క్రితం నెల్లూరుకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం వారు నెల్లూరు కరెంటాఫీసు సెంటర్ లో శ్రీరామ క్యాంటీన్ ను నడుపుతున్నారు. అక్కడే సైదాపురం మండలం, ఊటుకూరు గ్రామానికి చెందిన మన్నూరు శివకుమార్ అనే 26 ఏళ్ల యువకుడు గత 10 ఏళ్లుగా సప్లయిర్ గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడూ పొరపాట్లు చేసినప్పుడు యజమాని మందలించడంతో కృష్ణారావుపై కోపం పెంచుకున్న శివకుమార్ ఎలాగైనా కక్ష్య తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా ఉంటూనే యజమాని కుటుంబంతో నమ్మకంగా మెలిగే వాడు. ఈ క్రమంలో యజమాని నివాసంలో చోరీ చేయాలని, ఆ సమయంలో ఎవరు అడ్డు వచ్చినా హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 27వ తేదీనా శివకుమార్ తన స్నేహితుడైన నాయుడుపేట చంద్రబాబు నగర్ కాలనీకి చెందిన కాలదంగల రామకృష్ణను తన వద్దకు పిలుచుకుని ఈ చోరీ చేస్తే జీవితంలో సెటిల్ అవుతామని చెప్పడంతో అతను కూడా అంగీకరించాడు.

ఈనెల 27వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరూ పడారుపల్లి అశోక్ నగర్ లోని వాసిరెడ్డి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. అక్కడే నక్కి ఉన్న నేపద్యంలో కృష్ణారావు అప్పుడే ఇంటికి రాగా గేటు వద్దనే కర్రతో కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తరువాత మారు తాళాలతో ఇంటి తీళం తీసి బెడ్ రూంలో నిద్రిస్తున్న అతని భార్య సునీతను కూడా గొంతు కోసి హత్య చేశారు. ఇంట్లో ఉన్న ఒక లక్షా 60వేల రూపాయలను తీసుకుని అక్కడి నుండి పరారయ్యారు. 28వ తేదీ ఉదయం ఈ హత్య వెలుగుచూసింది. నెల్లూరు ఎస్పీ విజయరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఇవాళ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి నుండి మారణాయుధాలను, నగదును స్వాధీనం చేసుకుని జైలుకు పంపారు. దీనిపై ఇవాళ నెల్లూరులోని ఉమేష్ చంద్రా కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ విజయరావు విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించి, కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చిన వారికి ఎస్పీ విజయరావు రివార్డులు అందజేశారు.

Read Previous

పవన్ సిఎం అయితే ప్రతి రోజూ పండగే… చవితి రోజు కూడా ప్రజల్లోనే కేతంరెడ్డి

Read Next

ఆపదలో ఉన్న వ్యక్తికి మిత్రుల సహకారం : వైద్యానికి లక్ష అందజేత

Leave a Reply

Your email address will not be published.