నకిలీ ఈడి అధికారులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు…

Clock Of Nellore ( Nellore ) – ఈడీ అధికారులమని చెప్పి నెల్లూరులోని బంగారు దుకాణంలోకి చొరబడి సోదాలు చేసి భారీగా బంగారంతో ఉడాయించేందుకు ప్రయత్నించి చివరకు పోలీసులకు చిక్కిన నకిడీ ఈడీ అధికారులను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 26వ తేదీ మధ్యాహ్నం నగరంలోని కాకార్ల వీధిలో ఉన్న లావణ్య జ్యూయలరీస్ షాపులోకి ప్రవేశించిన 7 మంది దుండగులు తాము ఈడి అధికారులమని చెప్పి నకిలీ ఐడి కార్డులను చూపి సోదాలు చేపట్టారు. బంగారు విక్రయాలకు సంభందించిన బిల్లులు చూపాలని నకిలీ గన్ తో బెదిరించారు. షాపులో ఉన్న 12 కిలోల బంగారాన్ని తీసుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. క్షణాల్లో అక్కడకు చేరుకున్న సంతపేట పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అందరూ నకిలీ అని నిర్ధారణ అయింది. ఇవాళ వారిని అరెస్ట్ చేశారు.

దీనిపై నేర విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను తెలియజేశారు. ప్రకాశం జిల్ల కు చెందిన అరవీటి రమేష్, కర్నూలు జిల్లాకు చెందిన ఈడిగ మద్దిలేటి గౌడ్, హైదరాబాద్ కు చెందిన కౌశల్ రావు, సత్యసాయి జిల్లాకు చెందిన యోగానంద్ గౌడ్, నంద్యాలకు చెందిన గుంజి బాలకృష్ణ, సత్యసాయి జిల్లాకు చెందిన గిరక బాబు, నెల్లూరుకు చెందిన మంచాల వెంకటకృష్ణ అనే 7 మంది గత 4 నెలలుగా రెక్కీ నిర్వహించి ఈ దోపిడీకి యత్నించారన్నారు. వారి నుండి 2 ఇన్నోవా కార్లు, నకిలీ గన్, నకిలీ ఐడి కార్డులు, పోలీస్ యూనిఫాం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏ1 ముద్దాయి అయిన రమేష్ గతంలో కర్నూలులో జరిగిన హత్య కేసులో ముద్దాయిగా ఉన్నారని, అలాగే హైదరాబాద్ లో ఫైనాన్స కంపెనీ పెట్టి మోసం చేసిన కేసులో కూడా ముద్దాయిగా ఉన్నారన్నారు. యోగానంద్ అనే ముద్దాయి కర్నూలులో దొంగనోట్ల కేసులో ముద్దాయిగా ఉన్నారన్నారు. 7 మంది ముద్దాయిలను రిమాండ్ కు పంపుతున్నట్లు అదనపు ఎస్పీ చౌడేశ్వరి పేర్కొన్నారు.

Read Previous

నెల్లూరు నగరంలో దారుణం : దంపతులను గొంతు కోసి చంపిన కిరాతకులు

Read Next

గణేష్ నిమజ్జనానికి అన్నీ వసతులు : నిమజ్జన ఘాట్ పరిశీలించిన మంత్రి కాకాణి

Leave a Reply

Your email address will not be published.