గాంధీగిరి నిరసన చేపడతా … హెచ్చరించిన కోటంరెడ్డి – ఆనం ఆవేదన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులో ఇవాళ జరిగిన జిల్లా అభివృద్ధి కమిటి సమావేశంలో మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎదుట పలువురు ఎమ్మెల్యేలు సమస్యలపై అధికారులను నిలదీశారు. వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే గాంధీగిరి నిరసన చేపడతానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు 12వ డివిజన్ వావిలేటిపాడులో జగనన్న లే అవుట్ ఏర్పాటు చేశారన్నారు. 1, 2, 12వ డివిజన్లకు చెందిన సుమారు 3వేల మంది లబ్ధిదారులకు అక్కడ స్థలాలు ఇవ్వగా ఇంత వరకూ ఒక్క నిర్మాణాన్ని కూడా చేపట్టలేదన్నారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేసే పరిస్థితి లేదన్నారు. చెరువును తలపించే విధంగా ఉన్న ఆ స్థలాన్ని చదును చేయాలని ఏడాది కాలంగా అధికారులను కోరుతున్నా స్పందన లేదన్నారు. ఎప్పుడు చేస్తారో చెప్పాలని లేదంటే సమావేశాన్ని ముందుకు సాగనివ్వనని తేల్చిచెప్పారు. దీంతో స్పందించిన అధికారులు మూడు నెలల్లో లే అవుట్ చదును చేసే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో పనులు మొదలు పెడతామన్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మూడు నెలల్లో పనులు పూర్తి చేయకుంటే గాంధీ గిరి పద్దతిలో నిరసన చేపడతానని స్పష్టం చేశారు.

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ సైదాపురం మండలం, గిద్దలూరు ఉప సర్పంచ్ రమణారెడ్డి తన స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుంటే కొంత మంది అధికారులు అడ్డంకులు సృష్ఠించారని, చివరకు మనో వేదనకు గురైన రమణారెడ్డి ప్రాణాలు విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు అంత సక్రమంగా ఉందని తేల్చినా పోలీసులు కూడా అడ్డుపడ్డారన్నారు. దీనికి ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మానవ హక్కుల సంఘం పేరుతో ఓ వ్యక్తి పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. ఆ వ్యక్తి ఏ సంఘానికి చెందిన వ్యక్తి కాదని తమ విచారణలో తేలిందన్నారు. దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇంత వరకూ దానిపై చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Previous

వాడీవేడీగా జిల్లా సమీక్షా సమావేశం – సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు

Read Next

సమస్యలకు నిలయంగా 13వ డివిజన్ – కేతంరెడ్డి ఆరోపణ

Leave a Reply

Your email address will not be published.