Clock Of Nellore ( Nellore ) – నెల్లూరులోని 13వ డివిజన్ పరిధిలో ఉన్న ఎలమవారిదిన్నె ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, అనీల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు కీలకంగా వ్యవహరించిన ఈ ప్రాంతాన్ని ఆయన పట్టించుకోకపోవడం దురదృష్ఠకరమని జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. పవనన్న ప్రజాబాటలో భాగంగా 103వ రోజైన శనివారం సాయంత్రం ఆయన ఎలమవారిదిన్నెలో పర్యటించారు. ప్రధాన రహదారి పక్కన నివసిస్తున్న వారి ఇంటింటికి వెళ్లి పలకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. ప్రధాన రహదారి అధ్వాన్నంగా ఉందని, సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్ ఎలమవారిదిన్నె అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యుత్ తీగలు ఇళ్లను ఆనుకుని ఉన్న కారణంగా ఓ బాలిక మరణించినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జనసేన పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని కేతంరెడ్డి పేర్కొన్నారు.
