అంతరిక్షంలోకి బాలికల ప్రతిభ… ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి

Clock Of Nellore ( SrihariKota ) – దేశంలోని 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థినుల భాగస్వామ్యంతో ‘ఆజాదీశాట్‌’ అనే ఉపగ్రహం రూపుదిద్దుకుంటోంది. దీన్ని 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలకు గుర్తుగా ఆగస్టు మొదటి వారంలో కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలలో 8 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 మంది బాలికలను నీతి ఆయోగ్‌ భాగస్వామ్యంతో ఎంపిక చేశారు. ‘అంతరిక్షంలో మహిళలు’ అనే ఐక్యరాజ్య సమితి థీమ్‌ నేపథ్యంలో ‘ఆల్‌ ఉమెన్‌ కాన్సెప్ట్‌’తో దీన్ని రూపొందిస్తున్నారు. 8 కిలోల బరువున్న ఉపగ్రహం సమాచార సేవలందించనుంది.

ఆజాదీశాట్‌ తయారీలో నారాయణవనం జడ్పీ ఉన్నత పాఠశాల (తిరుపతి జిల్లా), సెయింట్‌ ఫ్రాన్సిస్‌ బాలికల పాఠశాల(సికింద్రాబాద్‌), గురజాగుంట(తెలంగాణ), జేసీ ఎర్రుపాలెం టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ (తెలంగాణ), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌, కురుగుంట (అనంతపురం), డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులం వీరలంకపల్లి(ఆంధ్రప్రదేశ్‌), జడ్పీ ఉన్నత పాఠశాల, జి.ఆర్మూరు(తెలంగాణ), జీహెచ్‌ఎస్‌, వెంగళ్‌రావునగర్‌(హైదరాబాద్‌)కు చెందిన విద్యార్థుల భాగస్వామ్యం ఉంది. ఇందుకు హెక్సావేర్‌ టెక్నాలజీస్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద రూ.58 లక్షలు సమకూర్చింది. చెన్నైలోని స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. సాయం అందించిన 15 మంది స్పేస్‌ కిడ్జ్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల్లో తిరుపతికి చెందిన సాయి, రఘుపతి, హైదరాబాద్‌కు చెందిన కీర్తన్‌ ఉన్నారు.

Read Previous

జడ్పీ ఛైర్మైన్ ఆనం అరుణమ్మను కలిసిన పేర్నాటి…

Read Next

సిఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో కోటంరెడ్డి సోదరులు భేటీ…

Leave a Reply

Your email address will not be published.