Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు నగర పరిధిలో చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న 9 మంది ముద్దాయిలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు ( Nellore Police ). వారి వద్ద నుండి 10 లక్షల విలువైన 8 బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు సిటీ, కప్పరాళ్లతిప్ప ప్రాంతాలకు చెందిన కడివేటి సునీల్, తాటిపర్తి మస్తాన్, తమ్మినేని రాజేష్, మాలపాటి వెంకయ్య బాబు, షేక్ హుస్సేన్ బాషా, జగన్నాధం సురేంద్ర, గోగుల సునీల్, బాణాల చిన్న, తుపాకుల హనూక్ అనే 9 మంది జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నారు. వరుస చైన్ స్నాచింగ్ ఘటనల నేపద్యంలో జిల్లా ఎస్పీ విజయరావు స్పెషల్ టీం ను ఏర్పాటు చేశారు. ఈ చోరీలపై విచారణ జరిపిన స్పెషల్ టీం 9 మంది ముద్దాయిలను ఇవాళ అదుపులోకి తీసుకుని చోరీ చేసిన బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎస్పీ విజయరావు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ పరిధిలో మూడు కేసులు, వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు వీరిపై నమోదయినట్లు తెలిపారు. 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో క్రైం విభాగం అదనపు ఎస్పీ చౌడేశ్వరి ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.