Clock Of Nellore ( Nellore ) – మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు త్యాగశీలిని, పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నేటి యువత దేశాభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ ( Nellore ZP Chair Person Anam Arunamma ) పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతిని పురస్కరించుకొని నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అల్లూరి చిత్ర పటానికి ఆమె ఘన నివాళి అర్పించారు. అనంతరం అరుణమ్మ మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులు అల్లూరి సీతారామ రాజు అని అన్నారు. వారి త్యాగశీలిని, పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నేటి యువత సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఎటువంటి అభివృద్ధి లేని గోదావరి ఏజన్సీ ప్రాంతంలో గిరిజన తెగ వారిలో దేశభక్తిని రగిలించి స్వాతంత్య్ర విప్లవానికి నాంది పలికిన దేశభక్తుడు అల్లూరి సీతారామ రాజు అని గుర్తుచేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారని, తెలుగు వారు ఉన్నంత కాలం మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు గుర్తుండిపోతుందని, వారి పేరుతో నేడు జిల్లాను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఛైర్ పర్సన్ అరుణమ్మ పేర్కొన్నారు.
