Clock Of Nellore ( Turupathi ) – నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యం నుండి సంపూర్ణంగా కోలుకున్న తరుణంలో వెంకటేశ్వర స్వామికి మొక్కు తీర్చుకునేందుకు నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ నెల్లూరు నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వారు పాదయాత్ర మొదలు పెట్టారు. శనివారం రాత్రి వారు అలిపిరికి చేరుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించి కాలినడకన తిరుమలకు వెళ్లారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తమ లాంటి వారికెంతో మందికి రాజకీయంగా అవకాశాలు కల్పించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనారోగ్యానికి గురవ్వడం తమనెంతో బాధించిందని.. ఆయన పూర్తి ఆరోగ్యంతో రావాలని పూజలు చేశామని జయవర్ధన్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రావడం తమతో పాటూ నెల్లూరు ప్రజలకు ఎంతో సంతోషాన్ని నింపిందన్నారు. స్వామి వారికి మొక్కు తీర్చుకునేందుకే కాలినడకన తిరుమల వచ్చామన్నారు. బడుగు, బలహీన వర్గాలు అన్నీ రంగాల్లో ఎదిగేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరంతరం తపిస్తుంటారని గుర్తు చేస్తూ అలాంటి మహా మనిషి కలకాలం ప్రజా జీవితంలో ఉండాలని కాంక్షించారు.
