Clock Of Nellore ( Amaravathi ) – రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఇవాళ గానీ రేపు గానీ రాజ్యసభ అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించేందుకు సమాయత్తమవుతోంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని మరోమారు కొనసాగించే అవకాశం ఉంది. మొత్తం ఖాళీ అయిన నాలుగు స్థానాల్లో 50 శాతం స్థానాలకు బీసీలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ సాయంత్రానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖాళీ 4 స్థానాలకు 5 మంది పోటీలో ఉండటంతో ఈ ఎంపిక ఉత్కంఠంగా మారింది. విజయసాయి రెడ్డిని మరో మారు కొనసాగించాలని సిఎం జగన్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ముగ్గుర్ని ఎంపికి చేయాల్సి ఉంది. ఈ మూడు స్థానాలకు నెల్లూరుజిల్లా నుండి పారిశ్రామిక వేత్త బీదా మస్తాన్ రావు, బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, జగన్ వ్యక్తిగత అడ్వకేట్ నిరంజన్ రెడ్డి, మహిళా కోటాలో కిల్లి కృషారాణి పోటీ పడుతున్నారు. బీదా మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యకు ఖరారు అయినట్లు చెబుతున్నారు. మిగిలిన ఒక స్థానాన్ని నిరంజన్ రెడ్డి, కిల్లి కృపారాణిలో ఎవరు దక్కించుకుంటారో తేలాల్సి ఉంది. మహిళా కోటాలో కృపారాణికే కేటాయిస్తారని చెబుతున్నారు. ఇవాళ సాయంత్రం, లేదా రేపటి లోగా దీనిపై స్పష్టత రానుంది.
రాష్టం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వి.విజయ సాయిరెడ్డి, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సురేష్ ప్రభుల పదవీకాలం జూన్ 21తో ముగుస్తుంది. ఆ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. శాసన సభలో పార్టీల బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే నాలుగు స్థానాలూ వైసీపి ఖాతాలోకి చేరాయి. ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు మే 31గా ఈసీ నిర్ణయించింది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.