త్వరలోనే ఫిషింగ్ హార్భర్ కల సాకారం – మత్స్యకార భరోసాలో కలెక్టర్ వెల్లడి

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని 10,689 మంది మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద 10.689 కోట్ల రూపాయలు అందజేస్తోందని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం కోనసీమ జిల్లా నుండి సిఎం జగన్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెల్లూరు నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లాలోని 10,689 మంది మత్స్యకారులకు సంబంధించి 10.689 కోట్ల రూపాయల మెగా నమూనా బ్యాంకు చెక్కును వారికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. జిల్లాలో 120 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉందన్నారు. జిల్లాలో మత్స్యకారులు ఎప్పటి నుంచో ఒక గొప్ప కలగా ఎదురు చూస్తున్న జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ త్వరలో సాకారం కానుందన్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో హార్బర్ నిర్మాణం కానుందని తద్వారా 3500 మత్స్యకార కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. జిల్లాలో తీరం వెంబడి ఇప్పటికే కృష్ణపట్నం ఓడరేవు నడుస్తోందని మరో ఓడరేవు రామాయపట్నం వద్ద నిర్మించేందుకు త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందు కోసం 850 ఎకరాల భూసేకరణ కార్యక్రమం పూర్తికావస్తోందన్నారు. త్వరలోనే ఈ ఓడరేవుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారన్నారు. ఈ రెండు ఓడరేవుల మధ్య ఉన్న ప్రాంతం అంతా ఆర్థికంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. జిల్లాలోని మత్స్యకారుల మేలుకోసం కొన్ని ఓడరేవు ఆధారిత పరిశ్రమలు రానున్నాయన్నారు.

ఈ పరిశ్రమల వలన జిల్లాలోని యువతకు సుస్థిరమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజల కోసం వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేయడం, ఒక లీటర్ డీజిల్ కు తొమ్మిది రూపాయలు సబ్సిడీ ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ఆక్వా రైతులకు ప్రతి యూనిట్ కు 2-40 రూపాయలకే విద్యుత్ సరఫరా అందించడం వలన మరింత ఎక్కువ సంఖ్యలో మత్స్య సంపద ఉత్పత్తి పెరుగుతోందన్నారు. ప్రతి సంవత్సరం ప్రాథమిక రంగం లో ఉత్పత్తులు పెరుగుదల కనిపిస్తోందన్నారు. జిల్లాలో 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల మేరకు నాణ్యమైన ఉత్పత్తులు దేశవిదేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుందన్నారు. జిల్లాలో మత్స్య సంపద ఆక్వా రంగం బలోపేతం చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు. ఆంధ్ర ఫిష్ పేరుతో మత్స్యకారులకు మార్కెటింగ్ సౌకర్యం పడవలు, వలలు అన్ని కూడా సబ్సిడీ ధరలతో అందించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందన్నారు. ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఈ నిధులతో జిల్లాలో మత్స్య సంపద పెంపుదలకు అన్ని విధాలా కృషి చేస్తామన్నారు.

Read Previous

నిర్లక్ష్యపు వైద్యుల్ని సస్పెండ్ చేయండి – కలెక్టర్ ను కోరిన యశ్వంత్ సింగ్

Read Next

చెంగాలమ్మ సేవలో మాజీ మంత్రి అఖిల ప్రియ… కుమారుడికి నామకరణం

Leave a Reply

Your email address will not be published.