ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన న్యాయమూర్తి : మాజీ మంత్రి నారాయణకు బెయిలు

Clock Of Nellore ( Chittore ) – నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకులు, మాజీ మంత్రి నారాయణకు న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో మేజిస్ట్రేట్‌ సులోచనారాణి బెయిల్‌ మంజూరు చేస్తూ ఇవాళ తెల్లవారు జామున ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించి… ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల నిర్వహించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నారాయణను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్‌ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. ఇవాళ తెల్లవారు జామున 5 గంటల వరకూ వాదనలు జరిగాయి. చివరకు నారాయణ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారు. రూ.లక్ష చొప్పున ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేయడంతో తెల్లవారు జామున 5 గంటల తర్వాత నారాయణ రోడ్డు మార్గంలో నెల్లూరులోని వారి నివాసానికి చేరుకున్నారు.

నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు నారాయణ తరఫున న్యాయవాది తెలిపారు. నారాయణ విద్యాసంస్థలతో నారాయణకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు. నేరారోపణ నమ్మేవిధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.

Read Previous

తుఫాను ఎఫెక్ట్ : నెల్లూరుజిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు

Read Next

తుఫానుపై మంత్రి కాకాణి సమీక్ష – ఎలాంటి నష్టం వాటిల్లకూడదని ఆదేశం

Leave a Reply

Your email address will not be published.