Clock Of Nellore ( Nellore & Kovur ) – రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జగనన్న హౌసింగ్ కాలనీల్లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు. బుధవారం నెల్లూరు నగర సమీపంలోని వెంకటేశ్వర పురం, కోవూరు మండలం, పడుగుపాడు వద్ద ఏర్పాటు చేసిన జగనన్న హౌసింగ్ లేఔట్ లో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ చక్రధర్ బాబు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ జాహ్నవితో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నదని, జగనన్న హౌసింగ్ లేఔట్ లలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయడంతోపాటు ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో మొదటి విడతలో 62 వేలకు పైగా ఇల్లు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 3 వేల ఇల్లు పూర్తి కాగా, మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వివిద దశల్లో ఉన్నాయని, ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల్లో అవగాహన కల్పించి రానున్న 2, 3 మూడు నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 135 జగనన్న లే అవుట్స్ లో ఇళ్ల నిర్మాణాలు జరుగుచున్నవని, సంబందిత లే అవుట్స్ లో త్రాగునీరు, విద్యుత్, అంతర్గత రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్నీ శాఖలను సమన్వయం చేసి త్వరగా ఇళ్ల నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారుల నుండి కూడా మంచి స్పందన వస్తున్నదని, ప్రతి సోమవారం స్టేజ్ అప్డేషన్ చేస్తూ త్వరగా బిల్లు చెల్లించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబందించి ఆప్షన్ 3 పరిధిలో వున్న ఇళ్ల నిర్మాణాలు కూడా త్వరగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జిల్లాలో రెండవ విడతలో నుడా పరిధిలో లేని ప్రాంతాల్లో 70 వేలకు పైగా ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు కూడా ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులను కోరారు.
