Clock Of Nellore ( Nellore ) – ముస్లిం సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా అండగా ఉంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరులోని అనిల్ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసంలో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష పాటించే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తొలుత ముస్లిం మతపెద్ద మౌలా అబూ బాకర్ ఉపవాస దీక్ష ఉద్దేశం గురించి వివరించారు. 11 మాసాలపాటు చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం ఈ పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష పాటిస్తారని, సర్వ మానవాళి కోసం ఉద్దేశించిన దే పవిత్ర ఖురాన్ గ్రంథమని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో కఠిన ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులను గౌరవిస్తూ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశామన్నారు. అతి పెద్ద దేశమైన భారతదేశంలో అనేక మతాలు, కులాలు ఉన్నప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలసిమెలసి ఉండటమే దేశ గొప్పతనమన్నారు. అందరి మనోభావాలను గౌరవిస్తూ అందరి అభివృద్ధికి ప్రభుత్వం పాటు పడుతుందన్నారు. ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లిం ఉద్యోగులను గౌరవిస్తూ, వారి వృత్తి ప్రవృత్తులకు ఆటంకం కలుగకుండా ఉపవాస దీక్షను పాటించేందుకు గంట ముందుగానే కార్యాలయం వదలి వెళ్ళుటకు అనుమతి నిచ్చిందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి తో పండుగలు, వేడుకలు చేసుకోలేకపోయామని అందుకనే ఈ సంవత్సరం అందరి ఆనందోత్సాహాల మధ్య ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకున్నామన్నారు. అల్లా దయతో జిల్లా అభివృద్ధివైపు నడవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి సయ్యద్ అబ్దుల్ అమీద్, నెల్లూరు ఆర్ డి ఓ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
