Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో నాడు – నేడు పథకం కింద రెండో విడత ఎంపిక చేసిన 889 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులను త్వరగా మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ( Collector Chakradhar Babu ) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నాడు – నేడు రెండో విడత పనులపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నాడు నేడు మొదటి విడత పనులను సమర్థవంతంగా పూర్తిచేశామని, ఇదే స్ఫూర్తితో రెండో విడత ఎంపిక చేసిన పాఠశాలల్లో కూడా అభివృద్ధి పనులను వేగంగా చేపట్టేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో నాడు నేడు రెండో విడత కింద ఏపీఈడబ్ల్యూఐడిసి కి 234 పాఠశాలలు, మున్సిపాలిటీకి 89 పాఠశాలలు, ఆర్డబ్ల్యూఎస్ కి 33, సమగ్ర శిక్ష కు 533 పాఠశాలలు కేటాయించామని, ఈ సంస్థలు వారికి కేటాయించిన పాఠశాలల్లో ఏజెన్సీలను సమన్వయం చేసుకుంటూ పనులను త్వరగా మొదలు పెట్టి వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు మొదలయ్యే నాటికి అన్ని పనులు పూర్తిచేయాలని సూచించారు. నాడు నేడు రెండో విడత పనులకు సంబంధించి అంచనాలను మంగళవారం లోపు పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, జడ్పీ సీఈవో వాణి, ఈఈ శ్రావణ్ కుమార్, ఏ ఎస్ ఓ రత్నం బాబు, అన్ని మండలాల ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
