ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ : కలెక్టర్ ప్రకటన

Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను చాలా వరకు భర్తీ చేశామని, ఇంకా మిగిలి ఉన్న పోస్టుల భర్తీకి త్వరలో మరో నోటిఫికేషన్ జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచం మొత్తం గర్వించదగిన అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మనకు అందించిన గొప్ప మేధావి బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ దేశంలో ప్రతి ఒక్కరికి పుట్టుకతోనే అన్ని హక్కులు కల్పించాలనే గొప్ప సంకల్పంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, రాజ్యాంగంలో దేశ పౌరులకు ఆయన కల్పించిన సమాన హక్కులతో దేశంలో ప్రస్తుతం సుపరిపాలన సాగుతోందని, ఫలితంగా వివిధ రంగాల్లో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధిస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్నో ఏళ్ల పాటు బానిస ప్రభుత్వంలో గడిపిన ప్రజలకు స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే ఒక దిక్సూచిలా ముందుకు నడిపించిందని, ఆయన కల్పించిన ఓటు హక్కు ఈరోజు అతి సామాన్యుడిని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేలా పనిచేస్తుందని, ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్ లేకుండా పరిష్కరించామని, త్వరలోనే బ్యాక్ లాగ్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. జిల్లా జనాభాలో 24 శాతం మంది ఉన్న ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కంటే ఎక్కువ సంక్షేమ ఫలాలను నవరత్నాలు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంతృప్తికరస్థాయిలో అందజేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Previous

ఎమ్మెల్యే కోటంరెడ్డితో భేటీ అయిన మాజీ మంత్రి అనీల్… జోరుగా ఊహాగానాలు

Read Next

3 కోట్లతో నర్తకి సెంటర్ అభివృద్ధి : నగర ఎమ్మెల్యే అనీల్ వెల్లడి

Leave a Reply

Your email address will not be published.