Clock Of Nellore ( Nellore ) – శ్రీ శుభకృత్ నామ నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరి కీ శుభం జరగాలని, ముఖ్యంగా రైతులకు అకాల వర్షాలు, వరదలు దరి చేరకుండా సమృద్ధిగా పంటలు పండాలని తద్వారా ప్రజలందరికీ ఆహార భద్రత కలగాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఆకాంక్షించారు. ఉగాది సందర్బంగా నెల్లూరు నగరంలోని కస్తూర్భా కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా సాంస్కృతిక మండలి వారిచే వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు సంప్రదాయానికి నిలువెత్తు రూపంగా కలెక్టర్ చక్రధర్ బాబు ఆహార్యం అందరినీ ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మన సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా, మన భాష, ఆచార వ్యవహారాలను తెలుసుకొని జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలని అభిలషించారు.

తొలుత జిల్లా అధికారుల బృందం కలెక్టర్ చక్రధర్ బాబుకు పూర్ణకుంభ స్వాగతం తో ఆహ్వానం పలికి వేదిక పైకి తీసుకేళ్ళారు. అనంతరం జిల్లా పరిషత్ ఛైర్ – పర్సన్ ఆనం అరుణమ్మ వెంటరాగా జ్యోతి ప్రజ్వలనతో జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆత్మకూరు సంగీత పాఠశాల వారి బృందం ప్రార్థన గీతం ఆలపించారు. అనంతరం వీనులవిందుగా నాదస్వర కచేరి నిర్వహించారు.

అనంతరం పంచాంగ శ్రవణం పఠించిన నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి మాట్లాడుతూ శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ ఆర్థికంగా,హార్థికంగా బాగుంటుందన్నారు. ఈ సంవత్సరం జిల్లాలో మంచి వర్షపాతం నమోదు అవుతుందన్నారు. జలాశయాలు నిండు కుండలను తలపిస్తాయన్నారు. వరి, ధాన్యాలు పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు. వాణిజ్య పంటలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉందన్నారు. పాడి పరిశ్రమ బాగుంటుందని, పాల ఉత్పత్తులు పెరిగి, పాల వెల్లువ సాధించే అవకాశం ఉందన్నారు.

తరువాత 12 మంది ఔత్సాహిక కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. అవ్వారు శ్రీధర్ బాబు, ములుగు లక్ష్మీ మైధిలి, పి. శివకుమార్, ఈతకోట సుబ్బారావు, నీలం స్వాతి, మోపూరి లక్ష్మీ నరసింహం, గోవిందరాజు సుభద్రాదేవి, మద్దూరి శ్రీనివాస రావు, తన్నీరు శశికళ, హాస్పి మోహన్ రాజు, షేక్ నజ్నా, ఇంద్రగంటి మధుసూదన్ వంటి కవులు ఉగాది ప్రాశస్త్యం గురించి వివరిస్తూ తమ కవితలతో ఆహుతులను అలరించారు. తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వ సంగీత కళాశాల వారిచే గణపతి ప్రార్ధన నృత్యం, అంజనీ డాన్స్ అకాడమీ వారి నృత్యరూపకం, గురుకృప కళాక్షేత్రం వారి భామాకలాప నృత్యం, శ్రీ నటరాజ కళాక్షేత్రం, శ్రీ శివసాయి కళా నిలయం వారి నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి.

చివరగా వివిధ రంగాలకు చెందిన జిల్లా ప్రముఖులను సన్మానించారు. కర్ణాటక సంగీతం నుండి డివి. సురేష్ రావు, డోలువాయిద్యం నుండి చిరంజీవి, నాదస్వరం నుండి కే .నాగభూషణం, శాస్త్రీయ నృత్యంలో పి. అంజనీ కుమార్, జానపద నృత్యంలో వి. సతీష్ కుమార్, హరికథ కు సంబంధించి టి. వాణిశ్రీ ,నాటక రంగం నుండి లోకా సులోచన, తబల కు సంబంధించి శాంతి కుమార్, శాక్సా ఫోన్ కు సంబంధించి వీరేపల్లి కిషోర్, వైద్య రంగం నుండి డాక్టర్ దాక్షాయిణి వంటి ప్రముఖులున్నారు.

ఈ వేడుకలలో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సైదాని, రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ చైర్ పర్సన్ పొట్టేళ్ల శిరీష, సంయుక్త కలెక్టర్లు హరేందిర ప్రసాద్, కుమారి జాహ్నవి, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఇంఛార్జి సంయుక్త కలెక్టర్ రోజ్ మాండ్, నెల్లూరు, కావలి రెవెన్యూ డివిజన్ అధికారులు హుస్సేన్ సాహెబ్, శీనా నాయక్, జిల్లా టూరిజం సాంస్కృతిక శాఖాకారి నాగభూషణం, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, డిఆర్డిఎ పీడీ సాంబశివ రెడ్డి , డి పి ఓ ధనలక్ష్మి , డి ఈ ఓ రమేష్, డి ఎస్ ఓ వెంకటేశ్వర్లు, సర్వ శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఉషారాణి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
