నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు… కసరత్తు చేస్తున్న ప్రభుత్వం

Clock Of Nellore ( Amaravathi ) – జిల్లాల పునర్విభజన పూర్తయిన వెంటనే ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్‌ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ దిశగా కసరత్తు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు జరిగి ఐదు నెలలైంది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్‌ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్‌ 25వ తేదీన ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఆయా పదవులకు ఎన్నికైన వారు మరో నాలుగున్నర ఏళ్లకు పైనే ఆ పదవుల్లో కొనసాగాల్సి ఉంది. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోందని పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్‌ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌కు లేఖ రాశారు. మరోవైపు జిల్లాల పునర్విభజన జరిగిన వెంటనే కొత్త జిల్లాల వారీగా జెడ్పీలను విభజిస్తే.. జెడ్పీ సీఈవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పంచాయతీ అధికారి వంటి అదనపు పోస్టుల కల్పనకు కూడా పంచాయతీ రాజ్‌ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

Read Previous

మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ యూనివర్శిటీగా మారనున్న ‘మెరిట్స్‌’

Read Next

వెంకటగిరిని రెవెన్యూ డివిజన్ గా మార్చండి… కలెక్టర్ కు ఆనం వినతి

Leave a Reply

Your email address will not be published.