Clock Of Nellore ( Nellore ) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత ఆశయాలతో రూపొందించిన స్పందన వేదిక ద్వారా ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం అందజేస్తున్నామని, నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న స్పందన వేదికను సద్వినియోగం చేసుకుని వివిధ సమస్యలకు సత్వర పరిష్కారం పొందాలని కమిషనర్ దినేష్ కుమార్ ఆకాంక్షించారు. కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నారని వివరించారు.
ప్రధానంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలకు సంభందించి 27 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సూచించిన గడువులోపే పూర్తిచేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల్లోని సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు వీలుగా గూగుల్ ప్లే స్టోర్ లో పొందుపరిచిన NMC FOR YOU యాప్ ను డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో అధికారులంతా ఓకేచోట అందుబాటులో ఉంటారు కాబట్టి, స్పందన వేదిక ద్వారా అందుకున్న ఫిర్యాదులను సంబంధిత శాఖలకు బదిలీ చేసి సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పర్యవేక్షిస్తామని కమిషనర్ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.