Clock Of Nellore ( Nellore ) – ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన అధికారికంగా ఖరారైంది. ఈ మేరకు ఖరారైన పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం నెల్లూరుజిల్లా కలెక్టరేట్ కు పంపింది. అధికారికంగా ఖరారైన వివరాల ప్రకారం ఈనెల 6వ తేదీనా ఉదయం 9:30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానం ద్వారా సిఎం జగన్ కడప విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10:40 గంటలకు నెల్లూరుజిల్లాలోని సంగంకు చేరుకుంటారు. 11 గంటలకు మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీని సిఎం ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవ అనంతరం అక్కడే ఉదయం 11:40 గంటల నుండి మధ్యాహ్నం 1:10 గంటల వరకూ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 1:15 గంటలకు హెలికాప్టర్ ఎక్కి 1:30 గంటలకు కోవూరుకు చేరుకుంటారు. హెలిప్యాడ్ నుండి కారులో నెల్లూరు బ్యారేజీపైకి చేరుకుంటారు. మధ్యాహ్నం 1:50 గంటల నుండి 2:20 గంటల లోపు రంగనాయకుల పేట వైపు ఏర్పాటు చేసిన పైలాన్ ఆవిష్కరించి నెల్లూరు బ్యారేజీని ప్రారంభిస్తారు. తదుపరి అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. నెల్లూరు బ్యారేజీ వద్ద ఎలాంటి బహిరంగ సభను నిర్వహించడం లేదు. నెల్లూరు బ్యారేజీ ప్రారంభోత్సవం అనంతరం కోవూరు వైపు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్ మధ్యాహ్నం 2:30 గంటలక హెలికాప్టర్ ఎక్కి తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా తిరిగి గన్నవరం చేరుకుని తాడేపల్లి నివాసానికి వెళ్తారు. ఈ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి కే. నాగేశ్వర రెడ్డి ధృవీకరించారు.