Clock Of Nellore ( Gudur ) – తమతో పాటూ టీచర్ ట్రైనింగ్ చేసి ప్రస్తుతం అనారోగ్యానికి గురై ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తోటి మిత్రుడిగా దన్నుగా నిలిచారు ఆ స్నేహితులు. గూడూరు మండలం, చెన్నూరుకు చెందిన జాలయ్య నెల్లూరుజిల్లా పల్లెపాడులోని డైట్ కళాశాలలో 1998 – 99 బ్యాచ్ విద్యార్ధి. ఆయనతో పాటూ ఇంకా చాలా మంది ఆ బ్యాచ్ లో ట్రైనింగ్ పొందారు. వారిలో కొంత మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాగా మరి కొందరికి రాలేదు. జాలయ్యకు కూడా ఉద్యోగం రాలేదు. ఈ క్రమంలో ఆయనకు అనారోగ్యం సోకింది. ఖరీదైన వైద్యం చేయించుకోవాల్సి ఉంది. ఈ విషయం తెలుసుకున్న సహచర ట్రైనింగ్ మిత్రులు జాలయ్యను ఆదుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉపాధ్యాయులుగా ఉన్న బాబు, దూడల పెంచలయ్య ఇద్దరూ ముందడుగు వేసి లక్ష రూపాయల నగదును పోగు చేశారు. ఇవాళ లక్ష రూపాయల నగదును జాలయ్యకు అందజేసి భరోసా కల్పించారు. వైద్యానికి ఇంకా నగదు కావల్లి ఉన్నా సర్ధుబాటు చేస్తామని పేర్కొన్నారు. ఎప్పుడులో 20 ఏళ్ల క్రితం కలిసి శిక్షణ తీసుకున్నామని, అప్పటి నుండి తనను గుర్తు పెట్టుకుని, నేడు తాను పడుతున్న ఇబ్బందిని గుర్తించి స్నేహితులంతా అండగా నిలబడటం నిజంగా ఆనందంగా ఉందని జాలయ్య ఆనందం వ్యక్తం చేశారు. స్నేహితుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో బాబు, దూడల పెంచలయ్యతో సహా కస్తూరి బాబు, ద్వారకానాథ్, నారాయణ, రత్నం, సురేష్, జయరాం, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
