Clock Of Nellore ( Kasumuru ) – పవిత్ర పుణ్య స్థలమైన కసుమూరు దర్గా కు వచ్చే భక్తులకు కనీస వసతులు కల్పించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం మండలం, కసుమూరు దర్గా వద్ద 2.65 కోట్ల రూపాయలతో నిర్మించనున్న భక్తుల వసతి గృహానికి మంత్రి, గూడూరు ఎమ్మెల్యే వర ప్రసాద్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా లతో కలసి శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కసుమూరు దర్గా కు వచ్చే భక్తులకు అవసరమైన కనీస వసతులు కల్పించుటకు అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి కసుమూరు దర్గా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కసుమూరు దర్గా అభివృద్ధి విషయమై వక్ఫ్ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే భక్తుల వసతి గృహ నిర్మాణానికి 2.65 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 2.60 ఎకరాల స్థలంలో భక్తుల వసతి సౌకర్య నిమిత్తం నిర్మిస్తున్న వసతి గృహంలో 23 రూములు నిర్మించడంతో పాటు మహిళలకు, పురుషులకు వేరుగా డార్మిటరీని నిర్మించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. దర్గా అభివృద్ధికి మరింత దృష్టి సారించడంతో పాటు పూర్తి స్థాయిలో భక్తులకు అవసరమైన వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ వసతి గృహ నిర్మాణం వలన గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాషా మాట్లాడుతూ, కసుమూరు దర్గాకు వచ్చే భక్తులకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న వసతి గృహం శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా వుందన్నారు. ఈ వసతి గృహ నిర్మాణానికి అవసరమైతే మరో కోటి రూపాయలు వక్ఫ్ బోర్డు నిధుల నుండి మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షించుకొని వాటి ఫలాలు పేద ముస్లీం సోదరులకు అందేలే కృషి చేస్తున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎంపిపి మందా కవిత, మెప్మా పిడి రవీంద్ర, తహశీల్దార్ నాగరాజు, పంచాయతీ రాజ్ డీఈ సత్య నారాయణ, కసుమూరు దర్గా కమిటీ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.