Clock Of Nellore ( Nellore ) – నెల్లూరుజిల్లా మనుబోలులో గురువారం తెలుగుదేశం పార్టీ నిర్వహించిన రైతు పోరు సభ అట్టర్ ప్లాప్ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ సభకు కనీసం వెయ్యి మంది రైతులు కూడా హాజరుకాలేదని, అంతకు మించి వచ్చినట్లు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీమానా చేస్తానని సవాల్ విసిరారు. శుక్రవారం నెల్లూరులోని వారి నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రైతులను టిడిపి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. టిడిపి కల్లబొల్లి మాటలు నమ్మవద్దని కాకాణి రైతులకు సూచించారు. రైతుల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశంకు లేదన్నారు. రైతులకు పగటి పూట 9 గంటల పాటూ ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మీటర్లు బిగించినా ఉచితంగా ఇస్తామని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నామే తప్పా రైతులను ఇబ్బంది పెట్టడానికి కాదని మంత్రి కాకాణి అన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఏ ఒక్క చర్య కూడా వైసీపి ప్రభుత్వం చేపట్టదని, చేపట్టబోదని మంత్రి హామీ ఇచ్చారు.