Clock Of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ 1వ డివిజన్ కోడూరుపాడులో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వెళ్లిన కోడూరుపాడుకు చెందిన పలువురు ఛైర్ పర్సన్ అరుణమ్మకు వినతి పత్రం అందజేసి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్నా పరీవాహక ప్రాంతంలోని పోడు భూమిని కొందరు ఆక్రమించి ప్లాట్లు వేసి అక్రమంగా విక్రయిస్తున్నారన్నారు. ఒక్కో ప్లాటును రెండు నుండి మూడు లక్షలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పెన్నానదిలో ప్రతీ రోజూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, దాని వల్ల పొర్లుకట్టలు తెగిపోతున్నాయని చెప్పారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న స్థానికులపై వారు దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అరుణమ్మను కోరారు. వెంటనే స్పందించిన అరుణమ్మ అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు దృష్ఠికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని సంభందిత అధికారులను ఆదేశించారు.