Clock Of Nellore ( Nellore ) – ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో 15వ ఆర్ధిక సంఘం నిధులతో 15కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు నెల్లూరు జడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ వెల్లడించారు. ప్రధానంగా రహదారులు, పాఠశాలల భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేశారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ కార్యాలయ ఛాంబర్ లో ఆమె శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉమ్మడి నెల్లూరుజిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో ఇప్పటికే పనులు జరుగుతున్నాయని, మరి కొన్ని చోట్ల ప్రారంభం కావాల్సి ఉందన్నారు. జిల్లా పరిషత్ లో ఉద్యోగులు బదిలీ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మంది MPDOలు, 16 మంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, 11 మంది సీనియర్ అసిస్టెంట్లు, 87 మంది జూనియర్ అసిస్టెంట్లు, 17 మంది టైపిస్టులు, 195 మంది రికార్డు అసిస్టెంట్లు, 62 మంది అటెండర్లతో కలిపి మొత్తం 411 మందిని బదిలీ చేశామన్నారు. క్రమం తప్పకుండా జడ్పీ స్టాండింగ్ కమిటీ, జనరల్ బాడీ సమావేశాలను నిర్వహిస్తున్నామని, ZPTC సభ్యులు, అధికారుల సమన్వయంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆదివారం స్టాండింగ్ కమిటి సమావేశాలు జరగనున్నాయని, ఆ సమావేశాల తర్వాత అభివృద్ధి పనుల పురోగతిని తానే స్వయంగా పరిశీలిస్తానని ఆనం అరుణమ్మ తెలియజేశారు.