Clock Of Nellore ( Nellore ) – రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా నెల్లూరు జిల్లాలోని 15,952 మంది ఆటో రిక్షా, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ 10,000 చొప్పున రూ. 15,95,20,000 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమ చేశారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం విశాఖపట్నం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్ గా ప్రారంభించిన వైయస్సార్ వాహన మిత్ర నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమానికి నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణం నుంచి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. వరుసగా నాలుగో ఏడాది వాహన మిత్ర నగదును ఆటో డ్రైవర్లకు అందించడం శుభపరిణామమన్నారు.

ఈ పది వేల రూపాయల సాయం ఆటో డ్రైవర్లకు వాహన బీమా, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇతర రిపేర్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ సాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అదనంగా 4258 మంది అర్హులైన లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తింప చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత అత్యధిక మంది లబ్ధిదారులు మన జిల్లాలోనే ఉన్నారన్నారు. ఆటోడ్రైవర్లందరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని వినియోగించుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, ఉప రవాణా అధికారి చందర్, ప్రాంతీయ రవాణా అధికారి ఆర్ సుశీల, జడ్పీ సీఈవో వాణి, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు, సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
