Clock Of Nellore ( Kuwait ) – ఉపాధి కోసం కువైట్ కు వెళ్లి అక్కడ సరైన పనులు దొరక్క, స్వస్థలమైన ఏపిలోని తూర్పు గోదావరి జిల్లాకు రాలేక ఇబ్బందులు పడుతున్న కుసుమా రాంబాబు అనే వ్యక్తిని క్షేమంగా ఇండియాలోని వారి నివాసానికి చేర్చింది ఏపి ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ. వివరాల్లోకి వెళితే తూర్పు గోదావరి జిల్లా అప్పన్నపల్లి పంచాయితీలోని మామిడి కుదురుకు చెందిన కుసుమా రాంబాబు గత 10 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లాడు. అయితే అక్కడ అతనికి సరిపడా పనులు దొరక్కపోవడంతో అప్పటి నుండి ఇబ్బందులు పడుతున్నాడు. స్వదేశమైన ఇండియాకు రాలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇదే క్రమంలో తన భర్తను స్వదేశానికి రానివ్వకుండా అత్త మామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది రాంబాబు భార్య. దీంతో పోలీసులు రాంబాబు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని ఆ విషయాన్ని ఏపి ప్రభుత్వ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ ( APNRTS ) కువైట్ రీజియన్ కో – ఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డికి తెలియజేసి ఎలాగైనా రాంబాబును ఇండియాకు రప్పించాలని కోరారు.
దీంతో స్పందించిన మహేశ్వర రెడ్డి… వైసీపి కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి సహకారంతో ఇండియన్ ఎంబసి అధికారులతో చర్చించి అవుట్ పాస్ పోర్టును సిద్దం చేయించారు. మొత్తం ఖర్చులు వారే భరించి అతన్ని ఇండియాకు క్షేమంగా పంపారు. విమానం ద్వారా హైదరాబాద్ కు చేరుకున్న రాంబాబు ఇవాళ స్వస్థలమైన తూర్పు గోదావరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ తనకు సహకారం అందించిన వైసీపి కువైట్ కన్వీనర్ ముమ్మిడి బాలిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్స్ తెలుగు సొసైటీ ( APNRTS ) కువైట్ రీజియన్ కో – ఆర్డినేటర్ నాయిని మహేశ్వర రెడ్డి, APNRTS ఛైర్మైన్ మేడపాటి వెంకట్, సిఈఓ దినేష్, APNRTS డైరెక్టర్ బి.హెచ్. ఇలియాజ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రవాస ఆంధ్రుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన APNRTS తన వారికి ఎంతగానో అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కువైట్ వైసీపి నాయకులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, పులపుత్తూర్ సురేష్ రెడ్డి, నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అరవ సుబ్బారెడ్డి పాల్గొన్నట్లు వైసీపి గల్ఫ్ దేశాల మీడియా కో – ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా తెలియజేశారు.
