మూడేళ్లు కాలం వెళ్లదీసి ఇప్పుడు సమస్యలు పరిష్కరిస్తారా – వైసీపిపై కేతంరెడ్డి ధ్వజం

Clock Of Nellore ( Nellore ) – రాష్ట్రంలో వైసీపి ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అయిందని, ఈ మూడేళ్ల పాటూ కాలం వెళ్లదీసి సమస్యలు ఉంటే చెప్పండంటూ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం ఏంటని నెల్లూరు సిటీ జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న వైసీపి ఎమ్మెల్యేలకు నిలదీతలే ఎదురవుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగుతుందని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఎమ్మెల్యేలను ప్రజలు ఎందుకు నిలదీస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈ మూడేళ్లు ప్రజలకు ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు.

పవనన్న ప్రజాబాట పేరుతో నెల్లూరు నగర నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టి ఇంటింటికి వెళుతున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి శుక్రవారం 3వ డివిజన్ పరిధిలోని మైపాడు రోడ్డులోని ప్రశాంతి నగర్ లో పర్యటించారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించాలని, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకునేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో గడచిన మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. మూడేళ్లు కాలం వెళ్లదీసి ఇప్పుడొచ్చి సమస్యలు ఉంటే చెప్పాలని ఎమ్మెల్యే అనీల్ కుమార్ కోరడం విడ్డూరంగా ఉందన్నారు. నెల్లూరులో సమస్యే లేని ప్రాంతం, సమస్యే లేని ఇల్లు లేదని, మొత్తం సమస్యలేనని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పావుజెన్న చంద్రశేఖర్ రెడ్డి, చింతంరెడ్డి శిరీషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read Previous

గృహ పథకం పనులు వేగవంతం చేయండి – అధికారులకు మేయర్, కోటంరెడ్డి ఆదేశం

Read Next

50వ డివిజన్ లో ఎమ్మెల్యే అనీల్ పర్యటన – సమస్యలపై ఆరా

Leave a Reply

Your email address will not be published.