Clock Of Nellore ( Nellore ) – నవరత్నాల పథకంలో భాగంగా ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం పనులను వేగవంతం చేసి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు, గృహాలు మంజూరు చేయాలనీ వై.సీ.పీ. రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ స్రవంతి పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో గృహ నిర్మాణ సంస్థ అధికారులు, కార్పోరేషన్ హౌసింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అధికారులతో మాట్లాడుతూ నగర వ్యాప్తంగా జరుగుతున్న TIDCO గృహాల నిర్మాణ పనుల గురించి, జగనన్న కాలనీల ద్వారా పేదలకు అందిస్తున్న నివాస స్థలాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది లబ్దిదారులకు ఇప్పటివరకు టిడ్కో గృహాలను మంజూరు చేసారు, ఎంతమందికి ఇంటి స్థలాలు అప్పగించారో అధికారులను విచారించారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్దిదారునికి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం ద్వారా స్థలాలను మంజూరు చేసి ఆయా కాలనీలకు అవసరమైన తాగు నీరు, డ్రైనేజ్ వ్యవస్థ, వీధి దీపాలు, పార్కుల నిర్మాణం, రోడ్ల సౌకర్యం వెంటనే కల్పించాలని ఆదేశించారు.

జగనన్న కాలనీలు, TIDCO గృహాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు టెండర్లను త్వరిత గతిన జారీ చేసి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించారు. అర్హులైన లబ్దిదారుల పూర్తి వివరాలను వారితో ప్రత్యక్షంగా మాట్లాడి జగనన్న కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం స్వచ్చందంగా చేసుకునేల ప్రోత్సహించాలని ఆదేశించారు. లబ్దిదారులు కోరిన ప్రాంతాల్లో వారికి ఇంటి స్థలాలను, TIDCO గృహాలను మంజూరు చేసేలా చర్యలు తీస్కోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుని ఈ ఏడాది డిసెంబర్ లోపు అర్హులైన ప్రతి పేదవానికి శాశ్వత గృహ హక్కు కల్పించే దిశగా అధికారులు, సిబ్బంది ప్రణాలికా బద్దంగా కృషి చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటి కమీషనరు చెన్నుడు, సూపరింటెండెంట్ బి.నాగేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. దయాకర్, డిప్యూటి ఇంజనీర్ ఐ. శ్రీహరి గోపాల్, అసిస్టంట్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.