Clock Of Nellore ( Nellore ) – సోమవారం నుండి రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో పాటూ పరిపాలన ప్రారంభం కానున్న నేపద్యంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాలకు అధికారులను సర్ధుబాటు చేసే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న జిల్లాల్లో పనిచేసే అధికారులు, సిబ్బందిని కొత్త జిల్లాలలకు బదిలీ చేస్తున్నారు. నెల్లూరుజిల్లాకు సంభందించి ఆదివారం పలువుర్ని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు ఆర్డీఓగా పనిచేస్తున్న హుస్సేన్ సాహెబ్ ను విశాఖపట్నం ఆర్డీఓగా బదిలీ చేశారు. ఆత్మకూరు ఆర్డీఓ చైత్ర వర్షిణిని రాజమహేంద్రవరం ఆర్డీఓగా బదిలీ చేశారు. తెలుగుగంగ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. విజయకుమార్ ను కృష్ణా జిల్లా ఉయ్యూరు ఆర్డీఓగా బదిలీ చేసింది ప్రభుత్వం. నాయుడుపేట ఆర్డీఓ పి. సరోజినిని బాపట్ల జిల్లా చీరాల ఆర్డీఓగా బదిలీ చేశారు.
ప్రకాశం జిల్లా ఫారెస్ట్ సెటిల్ మెంట్ అధికారిణి పి. ఉమాదేవిని నెల్లూరుజిల్లాలో కలిసిన కందుకూరు ఆర్డీఓగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న డిప్యూటీ కలెక్టర్ పి. కొండయ్యను నెల్లూరు ఆర్డీఓగా నియమించింది. ప్రభుత్వ అదనపు పిఎస్ గా పనిచేస్తున్న ఎమ్. కిరణ్ కుమార్ ను ఆత్మకూరు ఆర్డీఓగా నియమించింది. నెల్లూరు కెఆర్ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దాసును నంద్యాల జిల్లా ఆత్మకూరు ఆర్డీఓగా ప్రభుత్వం నియమించింది. నెల్లూరు ఆసరా జాయింట్ కలెక్టర్ గా ఉన్న కె. రోజ్ మాండ్ ను సూళ్లూరుపేట ఆర్డీఓగా నియమించింది. అలాగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ గా ఉన్న డి. హరితను తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ కు ఆర్డీఓగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.